ఒకటి కాదు..రెండు క్వారీలు.

జనావాసాల మధ్య జోరుగా క్వారీ దందా..

ఒకటి కాదు.. పక్కపక్కనే రెండు క్వారీలు..!

మిషన్లు నడుపుతూ పట్టుబడ్డ యాజమాన్యం..!

వివరాలు వెల్లడిస్తున్న మైనింగ్ ఎ డి రామాచారి
అక్రమంగా నిర్వహిస్తున్న మరో క్వారీ

హనుమకొండ అర్బన్ పరిధిలో జానవాసాలకు అతి సమీపంలో రెండు క్వారీల నిర్వహణ వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. నివాస ప్రాంతాల ప్రహరీ గోడలను ఆనుకుని భారీ రాతి బండలను కట్ చేస్తూ క్వారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మైనింగ్, రెవెన్యూ అధికారుల తనిఖీల్లో బయటపడింది.
తాజాగా అందిన సమాచారంతో మైనింగ్ శాఖ, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అక్కడ భారీ గ్రానైట్ రాళ్లను కట్ చేసే యంత్రాలు నడుస్తుండగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. క్వారీ ప్రాంతంలో భారీ పరిమాణంలో రాతి బండలు, కటింగ్ యంత్రాలు, విద్యుత్ ప్యానెల్లు, నీటి సదుపాయాలు ఏర్పాటు చేసిన దృశ్యాలు కనిపించాయి.
క్వారీల ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం రెండు వేర్వేరు యూనిట్లు పక్కపక్కనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నివాస గృహాలకు అతి సమీపంలోనే తవ్వకాలు జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. భారీ రాళ్ల కటింగ్ సమయంలో వెలువడే దుమ్ము, శబ్ద కాలుష్యంతో పాటు భద్రతాపరమైన ప్రమాదాలు కూడా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అధికారులు క్వారీ ప్రాంతంలో రికార్డులు పరిశీలించి అనుమతుల వివరాలు సేకరిస్తున్నారు. తవ్వకాల అనుమతులు, భూవినియోగ అనుమతులు, కాలుష్య నియంత్రణ బోర్డు క్లియరెన్సులు, మైనింగ్ లైసెన్సులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొన్ని యంత్రాలను పరిశీలించి కార్యకలాపాలపై వివరాలు నమోదు చేసినట్లు తెలిసింది.
ప్రత్యేకంగా క్వారీ ప్రాంతం చుట్టూ నివాస గృహాలు ఉండడం, ప్రహరీ గోడలకు ఆనుకుని రాతి బండలను నిల్వ చేయడం భద్రతాపరంగా ప్రమాదకరమని అధికారులు కూడా భావిస్తున్నట్లు సమాచారం. స్థానికులు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు ఆలస్యమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే తనిఖీలు కొనసాగుతుండగా, పూర్తి స్థాయి నివేదిక అనంతరం క్వారీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహించినట్లు తేలితే యాజమాన్యంపై కేసులు నమోదు చేసి యంత్రాలను సీజ్ చేసే అవకాశమూ ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here