మడికొండలో అక్రమ తవ్వకాల కలకలం.. క్వారీ మూసివేతకు వెళ్లిన అధికారులకు షాక్






లోపలికి అనుమతించని యాజమాన్యం.. డీఆర్‌ఎఫ్ సిబ్బందితో గేట్ తాళాలు పగులగొట్టిన అధికారులు
రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్‌తోనే క్వారీ నడుపుతున్నట్లు మైనింగ్ ఏడీ వెల్లడి
ఐదేళ్లకు పైగా జనావాసాల పక్కనే తవ్వకాలు జరుగుతుంటే ఇప్పటివరకు అధికారులు ఏం చేశారన్న ప్రశ్నలు
హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ లో అక్రమ క్వారీ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. సర్వే నంబర్లు 988, 989లో భారీ స్థాయిలో రాతి తవ్వకాలు కొనసాగుతున్నాయన్న సమాచారంతో తహసీల్దార్, సీఐ, ఎంవీఐ, మైనింగ్ ఏడీ బృందాలు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించగా.. యాజమాన్యం అధికారులను లోపలికి అనుమతించకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. చివరకు డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయంతో క్వారీ గేట్ తాళాలు పగులగొట్టి అధికారులు లోపలికి ప్రవేశించినట్లు సమాచారం.
స్థానికంగా భారీ రాతి తవ్వకాలు, బ్లాస్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్న ఈ ప్రదేశంలో సరైన మైనింగ్ అనుమతులు లేవని అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. క్వారీ నిర్వహిస్తున్న సంస్థ వద్ద మైనింగ్ లేదా స్టోన్ క్రషర్‌కు సంబంధించిన అనుమతుల కంటే “రియల్ ఎస్టేట్” కార్యకలాపాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం.
అధికారుల పరిశీలనలో బయటపడిన పత్రాల ప్రకారం “వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్” పేరిట ఉన్న ఉధ్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లో ప్రధాన కార్యకలాపంగా “ట్రేడింగ్” మరియు “రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు” మాత్రమే నమోదు చేయబడ్డాయి. అయితే అదే సంస్థ పేరుతో భారీ రాతి తవ్వకాలు, కట్టింగ్ యార్డ్ తరహా కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఇప్పుడు అనుమానాలకు తావిస్తున్నాయి.
ఇక మైనింగ్ ఏడీ స్వయంగా “రియల్ ఎస్టేట్ అనుమతులతో క్వారీ నడుస్తోంది” అని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో అసలు ప్రశ్నలు ఇప్పుడు మరింత పెరిగాయి. జనావాసాలకు అత్యంత సమీపంలో, భారీ స్థాయిలో రాతి కొండలను తవ్వుతూ కార్యకలాపాలు కొనసాగుతున్నా.. ఇంతకాలం సంబంధిత శాఖలు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం దాదాపు ఐదేళ్లుగా ఈ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయని సమాచారం. భారీ యంత్రాలు, ట్రాక్టర్లు, టిప్పర్లు, రాతి బ్లాకుల తరలింపులు బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ.. రెవెన్యూ, మైనింగ్, కాలుష్య నియంత్రణ శాఖలు ఇప్పటివరకు ఎలా గుర్తించలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
క్వారీ ప్రాంతానికి సమీపంలోనే జనావాసాలు ఉండటం, బ్లాస్టింగ్‌లతో దుమ్ము, కంపనలు వస్తున్నాయన్న స్థానికుల ఆరోపణలు కూడా ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పర్యావరణ అనుమతులు (EC), పొల్యూషన్ కంట్రోల్ బోర్డు CFO/CFE, DGMS బ్లాస్టింగ్ అనుమతులు ఉన్నాయా లేదా అన్న అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఒకవైపు అక్రమ తవ్వకాల ఆరోపణలు.. మరోవైపు రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్‌తో క్వారీ నిర్వహణ.. ఇప్పుడు మడికొండ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు కేవలం మూసివేతతో సరిపెడతారా..? లేక ఈ వ్యవహారానికి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.



