హనుమకొండ జిల్లాలోని శాయంపేట, పరకాల మండలాల్లో రైతులను ఓ హైబ్రిడ్ వరి విత్తనం తీవ్రంగా నష్టాల్లోకి నెట్టిన ఘటన సంచలనంగా మారింది. “కావేరి 929” పేరుతో విక్రయించిన వరి విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు గింజ కూడా రాకపోవడంతో నిండా మునిగారు…పంటను పూర్తిగా తొలగించాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు.
శాయంపేట మండలంలోని గట్ల కానిపర్తి,సూరంపేట, గ్రామాలతో పాటు పరకాల మండలంలోని ,పోచారం కామారెడ్డిపల్లి శివారు ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 40 ఎకరాలకు పైగా సాగు చేసిన వరి పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు.
“ఆడ విత్తనం ఓపెన్ కాలేదు”
బాధిత రైతుల కథనం ప్రకారం, కావేరి 929 హైబ్రిడ్ విత్తనాలను అధిక దిగుబడి వస్తుందనే నమ్మకంతో భారీ మొత్తాలు ఖర్చు చేసి కొనుగోలు చేశారు. గట్ల కానిపర్తిలోని ఓ పర్టిలైజర్ దుకాణం లో కొనుగోలు చేశారు…కానీ పంట పుష్పించే దశకు వచ్చిన తర్వాత అసలు సమస్య బయటపడిందని రైతులు వాపోతున్నారు.
“ఆడ విత్తనం ఓపెన్ కాలేదు.. మగ విత్తనం నుంచి పరాగసంపర్కం జరగలేదు.. గింజ పూర్తిగా రాలేదు” అని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో వరి తలలు వచ్చినా గింజ నింపుదల జరగకపోవడంతో పొలాలన్నీ వెలవెలబోయాయని చెబుతున్నారు.కొంతమంది రైతులు ఇప్పటికే పంటను ట్రాక్టర్లతో తొలగించగా, మరికొందరు పొలాల్లోనే ఎండిపోతున్న పంటను చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






ఎకరాకు లక్షల్లో నష్టం…?
విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీల ఖర్చులతో కలిపి ఎకరాకు భారీగా పెట్టుబడి పెట్టామని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు దిగుబడి పూర్తిగా కోల్పోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.“మేము కంపెనీ చెప్పిన విధంగానే సాగు చేశాం. పక్క పొలాల్లో ఇతర రకాల విత్తనాలు బాగానే ఉన్నాయి. మా పొలాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?” అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
కంపెనీ సీడ్ నాణ్యతపై అనుమానాలు…?
ఒకే రకం హైబ్రిడ్ విత్తనం వేసిన పలు రైతులకు ఒకే విధమైన సమస్య రావడంతో కావేరి 929 విత్తనాల నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “ఇది సాధారణ వాతావరణ ప్రభావం కాదు.. కంపెనీ విత్తనాల్లోనే లోపం ఉంది” అని రైతులు ఆరోపిస్తున్నారు.హైబ్రిడ్ వరి విత్తనాల్లో ఆడ, మగ లైన్ల సమన్వయం సరిగా లేకపోతే గింజ ఏర్పడదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. “ఆడ విత్తనం ఓపెన్ కాకపోవడం” జన్యుపరమైన లేదా నాణ్యత లోపం కావచ్చని కూడా నిపుణులు పేర్కొంటున్నారు.
వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం..?
పంట దెబ్బతిన్న వెంటనే వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు సరైన స్పందన ఇవ్వలేదని రైతులు ఆరోపిస్తున్నారు. విత్తనాల వల్ల పొలాల నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులకు చెప్పిన “ఇలా జరుగుతుంటుంది” అన్నట్టుగా నిర్లక్ష్యంగా మాట్లాడారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నష్టపోయిన రైతులకు న్యాయం చేయాల్సింది పోయి, స్పష్టమైన హామీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు.
పోలీసులను ఆశ్రయించిన రైతులు
సీడ్ కంపెనీ ప్రతినిధులు, సంబంధిత డీలర్లు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బాధిత రైతులు ఇప్పుడు శాయంపేట పోలీసులను ఆశ్రయించారు. తమకు జరిగిన నష్టానికి కంపెనీ బాధ్యత వహించాలని, పూర్తి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై వ్యవసాయ శాఖ, సీడ్ సర్టిఫికేషన్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రైతుల డిమాండ్లు
నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం
కావేరి 929 విత్తనాల నాణ్యతపై శాస్త్రీయ పరీక్షలు
బాధ్యులపై చర్యలు
డీలర్లు, కంపెనీపై కేసులు నమోదు
ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ
రైతుల కష్టానికి ఆధారమైన పంటే ఇలా పూర్తిగా దెబ్బతినడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. “విత్తనాల పేరుతో మమ్మల్ని మోసం చేశారు” అంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.



