పవన్ కల్యాణ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు
ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా తెలంగాణలో సభలు నిర్వహించడం సరికాదన్న పొన్నం
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారు ఇప్పుడు రాష్ట్రంపై ప్రేమ చూపించడం ఆశ్చర్యకరమని వ్యాఖ్య
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరిక
నవ నిర్మాణ సభ పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజలే తగిన సమాధానం చెబుతారని స్పష్టం.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో నిర్వహించనున్న నవ నిర్మాణ సభల నేపథ్యంలో స్పందించిన మంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రను అవమానించేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు.పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడటా” అంటూ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ముందుగా అక్కడి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.తెలంగాణకు వచ్చి నవ నిర్మాణ సభల పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే రాష్ట్ర ప్రజలు అంగీకరించరని ఆయన అన్నారు. “ఏపీలో ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి.. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభ పెడితే ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన వెనుక ఉన్న త్యాగాలను గుర్తు చేసిన మంత్రి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును గతంలో వ్యతిరేకించినవారు ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. “తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినని వెధవ వచ్చి.. ఇప్పుడు తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోము” అంటూ పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రం లక్షలాది మంది ప్రజల ఆకాంక్షలు, వేలాది మంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వ్యవహారం మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.



