డి ఎస్ ఓ డిఫాల్టర్ కుమ్మక్కు…?

కేసముద్రం మండల కేంద్రంలోని ఓ డిఫాల్టర్ మిల్లర్ కు మానుకోట జిల్లా పౌరసరాఫరాల శాఖ అధికారికి మధ్య ధాన్యం ఒప్పందం బాగానే కుదిరినట్లుంది. వివిధ సీజన్లలో ప్రభుత్వం ఐకెపి సెంటర్ల ద్వారా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మరాడించేందుకు మిల్లర్లకు పంపిన క్రమంలో ధాన్యాన్ని సిఎంఆర్ రూపంలో ప్రభుత్వానికి గొప్ప చెప్పకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని కోట్ల రూపాయల సొమ్ము చేసుకుని జిల్లాలోనే అత్యధికంగా ప్రభుత్వానికి బకాయి ఉన్న మిల్లర్గా రికార్డు సృష్టించిన సదరు యజమాని మిల్లులో ఈ ఖరీఫ్ సీజన్లో కూడా ప్రభుత్వ ధాన్యం లారీల కొద్దీ దిగడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గతంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ ,పౌరసరాఫరాల శాఖ అధికారులు కేసులు బుక్ చేసి మిల్లును సీజ్ చేసినప్పటికీ ఈ సీజన్లో మాత్రం మళ్లీ తిరిగి ప్రభుత్వ ధాన్యం సదరు మిల్లులో ప్రత్యక్షమవడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. డిఫాల్టర్ గా ఉన్న మిల్లు యజమాని జిల్లా స్థాయిలో అధికార పార్టీ నేత కావడం మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో పౌరసరాపరా శాఖ అధికారులు కూడా అతనికి తమ శాయశక్తుల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మిల్లర్కు ధాన్యం కేటాయించే విషయంలో అధికారులు అతి జాగ్రత్తగా వ్యవహరిస్తూ అదే మండల కేంద్రానికి చెందిన ఓ మిల్లును బినామీగా వాడుకొని సదరు డిఫాల్టర్ మిల్లుకు ధాన్యం కేటాయించి తమ అధికార భక్తిని మిల్లర్ వద్ద చాటుకున్నారు. ఇదిలా ఉంటే సంబంధిత అధికారి డిఫాల్టర్ మిల్లు విషయంలో కేవలం ధాన్యం దించుకునేందుకు ఆ మిల్లును ఒక గోదాం లా వాడుకుంటున్నామంటూ చెప్పకనే చెబుతూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. పైగా తాను చేసిందేదో దైవ కార్యము అన్నట్లు డీఎస్ఓ బుకాయిస్తూ అలా దించుకునేందుకు వీలుగా ప్రభుత్వ సర్కులర్ కూడా ఉందంటూ వివరణ అడిగిన న్యూస్ 10 ప్రతినిధికి మస్కా కొట్టే ప్రయత్నం చేశాడు. మా డీటీని పంపించి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని ఇప్పుడే ఆపే విధంగా చర్యలు తీసుకుంటానంటూ దాటవేత ధోరణితో సమాధానమివ్వడమే కాకుండా సర్కులర్ కాపీని కూడా మీకు పంపిస్తాను అంటూ తన అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. ఇక ఆ డీఎస్ఓకే తెలియాలి మరి డిఫాల్టర్ మిల్లును ప్రభుత్వం గోదంగా వాడుకునే విధంగా విడుదల చేసిన సర్కులర్ ఎక్కడ ఉందో మరి
ఇప్పటికే కోట్ల రూపాయల ధాన్యం డిఫాల్టర్ మిల్లు లో దించిన పౌరసరఫరాల శాఖ అధికారులపై జిల్లా కలెక్టర్ దృష్టిసారిస్తే కళ్ళు బైర్లు గమ్మే అటువంటి నిజాలు బయటపడే అవకాశం కూడా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వేచి చూడాలి మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత డీఎస్ఓ ,డిఎం డిఫాల్ట్ మిల్లు విషయంలో వ్యవహరించిన తీరుపై ఎలా స్పందిస్తారో మరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here