తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీకి చెందిన దామోదర్ లొంగిపోతాడనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అది బూటకపు ప్రచారం అని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ తెలిపారు…ఈ మేరకు ఆయన మీడియాకు ఓ లేఖను విడుదల చేసారు… దామోదర్ లొంగుబాటు అని జూన్ 1 నుంచి వివిధ పత్రికల్లో,సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని కొట్టిపారేశారు…అలాగే సీతక్క తాము లేఖ విడుదల చేసినట్లు వచ్చిన లేఖ తాము విడుదల చేసింది కాదని జగన్ తేల్చారు…కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకిస్తోందని అన్నారు…మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖ యధాతధంగా….
భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ
పత్రికా ప్రకటన
7/5/2025
జూన్ 1వ తేదీన తెలంగాణ రాష్ట్ర కమిటీ దామోదర్ లొంగిపోతున్నట్లు దిన పత్రికలలో, సోషల్ మీడియాలలో విస్తృత ప్రచారం చేసారు. మీడియా చేసిన ఈ ప్రకటనలలో ఎలాంటి వాస్తవం లేదు. పోలీసులే కావాలని ఉద్దేశ పూర్వకంగా ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో కూడా దామోదర్ ఎన్కౌంటర్లలో చనిపోయినట్లు లేదా లొంగిపోతున్నట్లు అనేక సార్లు ప్రచారం చేశారు. విప్లవ ప్రజలను గందరగోళ పరచడానికి మానసిక యుద్ధంలో భాగంగానే ఈ దుష్ప్రచారం కొనసాగుతోంది.
ఇటీవల మా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో 26.06.2025న మంత్రి సీతక్క పై వచ్చిన పత్రిక ప్రకటనకు మా పార్టీకి ఎలాంటి సంబధం లేదు.
అదే విధంగా కేంద్ర (బీజేపీ) ప్రభుత్వం మావోయిస్టు పార్టీ పై కొనసాగిస్తున్న పాశవిక ఆపరేషన్ కగార్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది. ఎన్కౌంటర్ లు ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నది. మావోయిస్టు పార్టీ సమస్య సామాజిక, రాజకీయ సమస్యని, అణిచివేతల ద్వారా మావోయిస్టు పార్టీని నిర్మూలించడం సరైనది కాదనీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తెలంగాణాలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు లేకపోయినప్పటికీ పోలీసులు మాత్రం మావోయిస్టు పార్టీకి ప్రజలు ఎలాంటి సహకారాన్ని అందించకూడని, సహకరించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, మావోయిస్టు పార్టీ వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలలో అమాయక ఆదివాసి ప్రజలను పోలీస్ స్టేషన్ ల కు పిలిచి బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని తెలియజేస్తున్నాము.
జగన్
అధికార ప్రతినిధి



