పట్టింపు లేని అధికారులు

మానుకోట సివిల్ సప్లయీస్ లో  అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఎగవేతదారులకే అధికారుల మద్దతు అన్నట్లు ఇక్కడి అధికారులు వ్యవహరిస్తున్న తీరు స్పష్టం చేస్తోంది. జిల్లాలోనే ప్రభుత్వనికి సీఎంఆర్ పెట్టడంలో రికార్డు స్థాయిలో బకాయి వుండి డీఫాల్టర్ మిల్లుల జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్న సదరు మిల్లు యజమానికి జిల్లా సివిల్ సప్లై అధికారులు అందలం ఎక్కించేలా బినామీ మిల్లు పేర ధాన్యం కేటాయించి తమ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ఇదిలా ఉంటే బకాయి మిల్లర్ కు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించినట్లు పత్రికల్లో వార్తలు కోడై కూస్తున్నా అవేమి తమకు పట్టనట్లు ఎలాంటి చర్యలకు సిద్ధపడకపోవడం దేనికి సంకేతమో మరి వారికే తెలియాలి.నేల రోజుల నుంచి నిర్విరామంగా మిల్లులో ప్రభుత్వ వడ్లు దిగుమతి జరుగుతున్నా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు మాత్రం మిల్లు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చూస్తాం ,చేస్తాం సమాధానాలు తప్ప చర్యలు శూన్యమన్న చర్చ అటు మిల్లర్లలోను మరోవైపు ఉద్యోగ వర్గాల్లోనూ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ధాన్యం కొనుగోళ్లు, మిల్లర్ల కేటాయింపుల విషయంలో ఎలాంటి చిన్న తప్పు జరగకుండా చూసుకోవల్సిన సంబంధిత డీ ఎస్ ఓ అధికారి కొందరు మిల్లర్లతో మాత్రమే చిట్ చాట్ కు పరిమితమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.డిఫాల్టర్ మిల్లుకు ధాన్యం కేటాయించి నెల రోజులు గడుస్తున్నా సదరు అధికారులు మిల్లర్ పై ఏ మాత్రం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ కూర్చోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఎగవేత కు పాల్పడిన మిల్లర్ పై చర్యలు తీసుకోకుండా డీఎస్ఓ, డీఎంలు అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిఫాల్టర్ మిల్లర్ పలుకుబడి ఉన్న రాజకీయ నేత కావడం ,రాష్ట్ర స్థాయిలో విపరీతమైన పరిచయాలు ,ప్రజా ప్రతినిధులతో సాన్నిహిత్యం ఉండటం వల్ల పౌర సరఫరాల శాఖ అధికారులు సదరు మిల్లు యజమనితో అంట కాగుతూ అతని పట్ల ఎనలేని గౌరవ మర్యాదలు చూపుతూ కాలం వెళ్లదీస్తున్నట్లు సమాచారం.
ఏది ఏమైనా డిఫాల్టర్ మిల్లుకు ధాన్యం కేటాయించిన అధికారులపై వారి యొక్క అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి జిల్లాలోని డిఫాల్టర్ మిల్లర్ల నుండి బకాయి ఉన్న సొమ్మును వసూలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అలాగే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్ల కు కేటాయించే విషయం లో పాటించాల్సిన ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారన్న ఆరోపణలు లేకపోలేవు
కావున జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తే పౌర సరఫరాల శాఖ అధికారుల అసలు బాగోతం బయటపడే అవకాశం కూడా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here