హన్మకొండలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (SRO) వేదికగా జరుగుతున్న భారీ అవినీతి నెట్‌వర్క్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బట్టబయలు చేశారు. కేవలం నగదు రూపంలోనే కాకుండా, ఏకంగా రూ. 42 లక్షల మేర డిజిటల్ లావాదేవీల ద్వారా లంచాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఆకస్మిక తనిఖీతో మొదలైన ఆపరేషన్
ఏప్రిల్ 2న హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ దొరికిన ప్రాథమిక ఆధారాలతో ఈ విచారణను వెంటనే అధికారుల నివాసాలకు కూడా విస్తరించారు. ఈ దాడుల్లో సబ్ రిజిస్ట్రార్-1 జమలాపురం రామనరసింహారావు, సబ్ రిజిస్ట్రార్-2 దావులూరి ఆనంద్‌ల పాత్రపై అధికారులు దృష్టి సారించారు.








వాట్సాప్ చాట్లు.. ఫోన్ పే లావాదేవీలు!
అవినీతికి డిజిటల్ హంగులు అద్దిన వైనం చూసి అధికారులు విస్తుపోయారు. కార్యాలయంలోని డాక్యుమెంట్ రైటర్ల ఫోన్లను పరిశీలించగా, అధికారులతో జరిగిన ఆర్థిక లావాదేవీల చిట్టా బయటపడింది.
గత ఏడాది కాలంలో సుమారు రూ. 42,03,125 విలువైన ఫోన్ పే (PhonePe) లావాదేవీలు జరిగినట్లు వాట్సాప్ చాట్‌ల ద్వారా స్పష్టమైంది.
డాక్యుమెంట్ రైటర్లు, కార్యాలయ సిబ్బంది మధ్య ఒక పక్కా వ్యవస్థీకృత నెట్‌వర్క్ నడుస్తున్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది.
కార్యాలయంలో పట్టుబడ్డ అక్రమాలు
తనిఖీల సమయంలో కార్యాలయం లోపల 20 మంది అనధికార ఏజెంట్లు/డాక్యుమెంట్ రైటర్లు తిష్టవేసినట్లు గుర్తించారు.
అధికారుల వద్ద లెక్కచూపని రూ. 47,450 నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 70 అన్‌రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, డెలివరీ చేయకుండా ఆపేసిన 204 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు అధికారుల కస్టడీలో ఉన్నట్లు గుర్తించారు.
అధికారి ఇంట్లో కనక వర్షం
సబ్ రిజిస్ట్రార్-2 దావులూరి ఆనంద్ నివాసంలో జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు లభ్యమయ్యాయి:
నగదు: రూ. 24,61,540
బంగారం: 819.500 గ్రాములు
వెండి: 2.600 కిలోలు
ఫిక్స్‌డ్ డిపాజిట్లు: కపిల్ చిట్స్‌లో రూ. 30.10 లక్షలు
ఈ అక్రమ ఆస్తులన్నీ ఆదాయానికి మించినవిగా ఏసీబీ భావిస్తోంది. సోదాల్లో మరిన్ని కీలక అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి, తదుపరి కఠిన చర్యల కోసం ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఏసీబీ పేర్కొంది.



