చెరువు కబ్జా పై రెవెన్యూ అధికారులు గప్ చుప్
గుంట భూమి కాదు గజం కాదు ఏకంగా రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమి అది సాగునీటిని అందించే చెరువుకు చెందిన భూమిని అడ్డగోలుగా కబ్జా చేసి ఆక్రమించి దర్జాగా వెంచర్ వేసిన ఇప్పటికి ఆ మండల రెవెన్యూ అధికారులకు కానీ ఉన్నతాధికారులకు,నీటిపారుదల అధికారులకు తెలియకపోవడం విచిత్రంగా ఉంది.అంతేకాదు బాహాటంగానే వెంచర్ వేసి ప్లాట్లు అమ్మివేసిన ఈ అక్రమ వెంచర్ విషయం ఇప్పటికి కుడా అధికారుల దృష్టికి రాకపోవడము విచిత్రమే….
హసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామ శివారులో ఉన్న చింతల చెరువులో అక్రమంగా వెంచర్ వెలిసిన రెవెన్యూ అధికారులు గప్ చుప్ గా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.వంగపహాడ్ గ్రామానికి సంబంధించి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడానికి క్రింది స్థాయి సిబ్బంది ఉన్న ఈ విషయం పై రెవెన్యూ అధికారులు ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా విషయం తెలిసిన అధికార పార్టీకి చెందిన నాయకుడు కనుక ఏకంగా చెరువునే కబ్జా పెట్టిన గమ్మున ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి.నడి చెరువులో వెంచర్ వెలిసి జోరుగా ప్లాట్ల కొనుగోళ్లు జరిగి సర్వే నంబర్ మాయతో రిజిస్ట్రేషన్ లు జరిగిపోయిన రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకున్నట్లు ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది.
వెంచర్ విషయం తెలిసిన….?
వంగపహాడ్ గ్రామ శివారులో చింతల చెరువులో వెంచర్ ఉందనే విషయం తెలిసిన రెవెన్యూ అధికారులు కావాలనే చూసి చూడనట్లు వదిలేశారని తెలిసింది.ఈ అక్రమ వెంచర్ పై స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన వారు పట్టించుకోనట్లు తెలిసింది.కొంతమంది ఈ వెంచర్ విషయమై పదే పదే పిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన తహశీల్దార్ సహనం కోల్పోయి ఓ వ్యక్తి పై కోపం చేసి కుర్చి విసిరేయ బోయాడని సమాచారం.అక్రమ వెంచర్ ,చెరువు కబ్జా పై ఫిర్యాదు చేస్తే తహశీల్దార్ ఇలా ప్రవర్తించడం వల్ల వారికి వీరికి సంబంధాలు బాగానే ఉన్నట్లు స్థానికులు అర్థం చేసుకొని ఇంకా ఎవరికి పిర్యాదు చేయాలో తెలియక ఉండిపోయారట.
మర్మం ఏమిటి….?
నగరికరణ పెరుగుతున్న నేపథ్యంలో వరంగల్ నగర శివారు భూములన్నీ చాలా విలువైన భూములుగా మారి పోయాయి.గజాలు వేల రూపాయలుగా మారాయి.దింతో ఎక్కడ వెంచర్ లు వేసిన భవిష్యత్ లో భూముల ధరలు మరింతగా పెరుగుతాయని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు భూములు కబ్జాలు చేసి అక్రమంగా వెంచర్ లు చేస్తున్నారు.సరిగ్గా ఇదే కోణంలో వంగపహాడ్ చింతల చెరువును ఆక్రమించి అధికార పార్టీ నేతను అని చెప్పుకొనే ఓ వ్యక్తి అక్రమ వెంచర్ కు తెర లేపినట్లు తెలిసింది. రెండున్నర ఎకరాల చెరువు కు చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించి సర్వే నంబర్ మార్చి రిజిస్ట్రేషన్ చేసి ప్లాట్లు విక్రయించిన వారికి ఏకంగా చెవిలో పువ్వులు పెట్టినట్లు తెలిసింది.ఈ తతంగం అంత నడపడానికి సదరు గులాబీ నాయకుడు భారీగానే సొమ్ము ఖర్చు చేసినట్లుగా తెలిసింది.చెరువును కబ్జా చేసి అక్రమాన్ని సక్రమం అనిపించుకోవడానికి కొందరు అధికారులనుండి మొదలుకొని ఒక్కరిద్దరు ప్రజాప్రతినిధులను సైతం ప్రసన్నం చేసుకొని పనికానిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది…. ఏకంగా చేరువునే కబ్జా చేసి వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించిన ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం కొందరిని ప్రసన్నం చేసుకోవడమేనని విశ్వసనీయ సమాచారం.మరి చెరువు భూమినే కబ్జా చేసి ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకున్న గులాబీ నేత పై అధికారులు చర్యలు తీసుకుంటార లేదా చూడాలి.
అక్రమ వెంచర్ హద్దులు తొలగిస్తాం
శంకర్ జె పి ఓ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)
న్యూస్-10 పత్రికలో వచ్చిన “చెరువులోనే వెంచర్” కథనాన్ని చూసాము… రేపు మా సిబ్బందితో వంగపహాడ్ శివారులోని చింతల చెరువు వెంచర్ వద్దకు వెళ్లి పరిశీలించి కూడా పీవో అజిత్ రెడ్డి అనుమతి తీసుకొని హద్దురాళ్లను, ప్రహారీని తొలగిస్తాము…
నోటీసులు జారీ చేస్తాం… క్రిమినల్ కేసులు పెడుతాం..
నాగేశ్వరరావు తహశీల్దార్ హాసన్ పర్తి
మండలంలోని వంగపహాడ్ శివారు చింతల చెరువులో వెంచర్ చేసిన విషయం ఈరోజే దృష్టికి వచ్చింది… రేపు మా సిబ్బందితో కలిసి చెరువును పరిశీలించి సదరు వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తాం… చెరువు కబ్జా నిజమే అని తేలితే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ భూమిని రక్షిస్తాం