కరోనా చికిత్సకు రూ.1000లోపు ఔషధాలు చాలు

ప్రజలెవరూ భయపడొద్దని మంత్రి విజ్ఞప్తి
ప్రైవేటు ఆస్పత్రులకు ఈటల హెచ్చరిక

అనారోగ్య లక్షణాలు కనబడితే ఆస్పత్రికి వెళ్లకుండా ఎవరూ దాచుకోవద్దని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలను కోరారు. ఇప్పటికే ఎన్నో రకాల వైరస్‌లను ఎదుర్కొన్న అనుభవం మన వైద్యులకు ఉందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజల్ని మళ్లీ మళ్లీ కోరుతున్నాం. జ్వరమే కదా.. దగ్గే కదా.. జలుబే కదా.. ఏమైతదిని మీ ఇళ్లలోనే మీరు ఉండొద్దు. అలా ఉంటే నాలుగైదు రోజులకో, వారం రోజులకో తీవ్రమైన శ్వాసకోశ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఈ రోగం ముఖ్య లక్షణమే ఊపిరితిత్తుల్లో గాలాడనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేసి చంపుతుంది. అందువల్ల వెంటనే చికిత్స అందితే ప్రాణ నష్టం ఉండదు. చికిత్స కూడా చాలా సులభం. పీహెచ్‌సీ స్థాయిలో కూడా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి’’ అని చెప్పారు.

కరోనా చికిత్సకు రూ.1000లోపు ఔషధాలు చాలు- news10.app

మానవత్వానికి కళంకం తెస్తున్నారు..:

‘‘కరోనా వైరస్‌ మానవాళికి అతిభయంకరమైన మహమ్మారి గనక మీ వంతుగా ప్రజలకు విశ్వాసం, ధైర్యం ఇవ్వండని ప్రైవేటు ఆస్పత్రులను గతంలో చాలాసార్లు కోరాం. సాటి మనిషికి ఆపన్న హస్తంఅందించాలని విజ్ఞప్తి చేశాం. వ్యాపార దృక్పథంతో చూడొద్దన్నాం. మేం కోరిన విధంగా కాకుండా కొన్ని ఆస్పత్రులు అనేక రకాలుగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు మాకు వందల, వేల ఫిర్యాదులు వస్తున్నాయి. ఆస్పత్రికి పోగానే రూ.2లక్షలు డిపాజిట్‌ చేయిండి అనడం.. చికిత్స జరగాలంటే రోజుకు రూ.లక్ష కట్టాలనడం.. 15 రోజులు ఉంటే రూ.15లక్షలు కట్టండి అంటూ వేధింపులకు పాల్పడటం వంటి ఫిర్యాదులు అందాయి. మనిషి చనిపోతే మృతదేహాన్ని అప్పగించడానికి రూ.4 లక్షలు కట్టాలని వేధించే పద్ధతి మానవ సమాజానికే ఓ కళంకంగా మారిపోయింది. అత్యంత హీనమైన చర్య. మేం మాట్లాడిన తర్వాత కూడా ఆస్పత్రులు వాటి పద్ధతులు మార్చుకోకపోతే మాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నియమించిన కమిటీలు అన్నీ పరిశీలిస్తున్నాయి. ఇంకా పద్ధతి మారకపోతే ఆ ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు రద్దు చేస్తాం. ఇప్పటికే ఓ ఆస్పత్రికి అనుమతులు రద్దు చేశాం. ప్రజలను భయపెట్టి లక్షల కొద్దీ వసూలు చేయడం సరికాదు’’అని తీవ్రంగా హెచ్చరించారు.

ఎక్కడైనా చికిత్స ఇదే..

‘‘కరోనాకు ఇస్తున్న మందులు 15 పైసల ట్యాబ్‌లెట్లు, రూ.10ల ఇంజెక్షన్లే తప్ప వేలాది ఖరీదు చేసే ఇంజెక్షన్లు లేవు. నిన్న నిపుణుల కమిటీ చెప్పిందేమిటంటే..అసలు ఈ చికిత్స అంతా కలిపితే రూ.1000 లకు మించదంటున్నారు. పెద్ద పెద్ద ఇంజెక్షన్లు, పెద్ద పెద్ద దవాఖానాలు, వెంటిలేటర్ల వరకు జనం ఆలోచిస్తున్నారు. అంత అవసరం లేదు. సకాలంలో ట్రీట్‌మెంట్‌తో పాటు ఆక్సిజన్‌ అవసరం.

ఆక్సిజన్‌ కూడా 10 రోజుల పాటు ఒక పేషెంట్‌కు పెడితే.. రోజుకో సిలిండర్‌వాడినా కూడా 10 రోజుల కాలంలో ఒక పేషెంట్‌పై రూ.2500 మాత్రమే ఖర్చవుతుంది. ఇదీ అసలు చికిత్స. వేరే రోగాల్లో లాగా కాదు. కార్పొరేట్‌ ఆస్పత్రి అయినా, గాంధీ ఆస్పత్రి అయినా.. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీ అయినా కరోనాకు ఇచ్చే మందులివే. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికక్కడే నయమవుతున్నారు. పరిస్థితి విషమించకముందే ఆస్పత్రికి వెళ్తే సురక్షితంగా బయటపడతారు. అందువల్ల ప్రజలు బెంబేలెత్తిపోయి ప్రైవేటు ఆస్పత్రులకు పోనక్కర్లేదు. హితం అనే యాప్‌ ద్వారా విశ్రాంత వైద్యులు సైతం వైద్య సలహాలుఇస్తున్నారు.

అంటుకోగానే చంపే శక్తి ఈ వైరస్‌కు లేదు

‘‘గత నాలుగైదు నెలలుగా కేసులు చూస్తుంటే ఎంత భయపడ్డామో ఈ రోజు ఆ పరిస్థితి లేదు.

ఇప్పటికే తెలంగాణ స్వైన్‌ఫ్లూ లాంటి వైరస్‌ని, న్యుమోనియా లాంటి వ్యాధిని అనేక రకాల వైరస్‌లను ఎదుర్కొంది. ఈ వైరస్‌పైనా ఒక అంచనా వచ్చింది. మరీ అంత భయపడనవసరంలేదు. అంటుకోగానే చంపగలిగే శక్తి దీనికి లేదని ఆచరణలో నిరూపితమవుతోంది. ఇంతకంటే భయంకరమైన వైరస్‌లు ప్రపంచంలో అనేక దేశాల్లో వచ్చినప్పటికీ వాటితో ఇంతస్థాయిలో నష్టం జరగలేదు.

ఈ వైరస్‌ మాత్రం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేయడమే లేకుండా మానవ సంబంధాలను సైతం ధ్వంసం చేసింది. వర్షాకాలం వచ్చింది గనక అనేక రకాల జబ్బులు వచ్చే సమయం. అందువల్ల మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాం.. ఏ ఇంట్లో ఏ వ్యక్తికి జలుబు, జ్వరం, దగ్గు, గుండెనొప్పి లాంటి సమస్యలు వచ్చినప్పుడు తక్షణమే పీహెచ్‌సీని సంప్రదించండి.

ఇప్పటికే గత నాలుగైదు నెలలుగా గ్రామీణ ప్రాంతంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ సర్వే చేసి ఏ సమస్య ఉన్నా చికిత్స అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గ్రామాల్లో కొవిడ్‌ లక్షణాలు కలిగిన రోగులు వస్తే ట్రీట్‌ చేయొద్దని ఆర్‌ఎంపీలకు కూడా సూచనలు ఇచ్చాం. వారిని పీహెచ్‌సీకి పంపాలని కోరాం. సీనియర్‌ వైద్యులతో జిల్లాలోని వైద్యులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

రోజుకు గరిష్ఠంగా రూ.9వేలు మించి తీసుకోవద్దన్నాం

‘‘రాష్ట్రంలో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత లేదు. రోగం ముదిరిన తర్వాత ఆక్సిజన్‌ పెట్టిన ప్రయోజనం ఉండటంలేదు.

చిన్న వైద్యానికే రూ.లక్షల బిల్లులు వసూలు చేయడం సరికాదు. ఏ జిల్లాకు ఆ జిల్లా దశల వారీగా అన్ని వైద్య కళాశాలల్లో కరోనా రోగులకు బెడ్‌లు కేటాయిస్తున్నాం. వ్యాధి ముదిరిన తర్వాత ఏ ఆస్పత్రికి వెళ్లినా ఫలితం ఉండదు.

ఇప్పటికే 5లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేయించాం. లక్షణాలు లేకుండా కేవలం అనుమానంతో పరీక్షలు చేయించుకోవద్దు. రోజుకు గరిష్ఠంగా రూ.9వేలకు మించి తీసుకోవద్దని ప్రైవేటు ఆస్పత్రులకు చెప్పాం. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను కొన్ని ఆస్పత్రులు దుర్వినియోగం చేస్తున్నాయి. ప్లాస్మా థెరఫీపై కొన్ని ఆంక్షలు ఉన్నాయి.. పైగా అందరికీ అవసరం ఉండదు’’ అని చెప్పారు.