మత్స్యగిరీశా….. మన్నించు

శాయంపేట లో ఆలయం సమీపంలోనే మద్యం అమ్మకం
రెండో వైన్ షాపుగా చెలామణి అవుతున్న బెల్ట్ షాపు
బెల్ట్ షాపులో అమ్మకాల కోసం సమయానికి ముందే మూతబడుతున్న అసలు వైన్ షాప్
చూసి చూడనట్లు వదిలేస్తున్న ఎక్సైజ్ అధికారులు
బెల్ట్ షాప్ లో అమ్మకాలకు ప్రజాప్రతినిధుల సహకారం…?

శాయంపేట మండల కేంద్రంలోని మత్స్యగిరి స్వామి ఆలయం ప్రక్కనే ఉన్న కిరాణం షాప్ లో బహిరంగంగానే మద్యం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు ఓ కిరాణా దారుడు. ఆలయ సమీపంలో మద్యం బెల్ట్ షాపు జోరుగా సాగుతోంది. కానీ ఇవేవీ పట్టనట్టు ఎక్సైజ్ అధికారులు మాత్రం దున్నపోతు మీద వర్షం పడిన చందంగా వ్యవహరిస్తున్నారు. అధిక ధరలతో ఇష్టారాజ్యంగా అక్రమ మద్యం బెల్ట్ దందా జోరుగా కొనసాగుతోంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ దందా కొనసాగుతున్నా అధికారులు ఎవరు నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మత్స్యగిరీశా..... మన్నించు- news10.app

ఎనీ టైం మందు( ఏటీ ఎం)

మద్యం కావాలా.. అయితే సమయం తో పని లేదు. ఏ సమయంలోనైనా మద్యం అందుబాటులో ఉంటుంది. ఏదైనా పండుగ వస్తే ఈ గల్లీ మొత్తం జాతరను తలపించే విధంగా రద్దీగా ఉంటుంది. ఏ బ్రాండ్ మద్యం అయినా సరే, ఒక్కో బ్రాండ్ కి ఒక్కో రేటు తో మద్యం అమ్మకాలు ఇక్కడ జరుగుతాయి. ఎక్సైజ్ నిబంధనలు వర్తించవు. ఎందుకంటే వారు చెప్పిందే రేటు ఆ రేట్ కి మద్యం విక్రయిస్తారు. ఇదేమిటని అడిగితే అది అంతే ఇష్టం ఉంటే తీసుకో లేదంటే మానుకో.. అని దురుసుగా సమాధానం ఇస్తారు.అధిక ధరలతో మద్యం అమ్మకాలు జరిపి మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పొడుస్తున్నారు. ఈ తతంగమంతా మత్స్యగిరి స్వామి ఆలయం ప్రక్కనే….జరుగుతుంది.

ఇది రెండో వైన్ షాప్……..

శాయంపేట మండల కేంద్రంలో నీ మైలారం వెళ్లే రోడ్డుకు లక్ష్మీ నరసింహ వైన్స్ షాప్ ఉందని తెలుసు కానీ ఇదే మండల కేంద్రంలో గ్రంథాలయానికి వెళ్లేదారిలో మత్స్య గిరి స్వామి ఆలయం పక్కనే కిరాణా షాపులో అక్రమ మద్యం బెల్ట్ షాప్ రెండవ వైన్ షాపు గా పేరుగాంచిందని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం అనుమతించిన వైన్ షాప్ లో ఏదైనా బ్రాండ్ మద్యం దొరకక పోవచ్చు కానీ ఇక్కడ మాత్రం అన్ని రకాల బ్రాండ్లను మద్యం ప్రియులకు అధిక ధరలకు అందుబాటులో ఉంచుతారు. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ బెల్ట్ దందాపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్య మేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రజాప్రతినిధుల అండదండలతో…

మండల కేంద్రంలో మత్స్యగిరి స్వామి ఆలయం సమీపంలో జరిగే అక్రమ మద్యం బెల్ట్ షాప్ నిర్వహణలో స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలతోనే ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ అక్రమ బెల్ట్ దందా స్థానిక ప్రజా ప్రతినిధులు కనుసన్నల్లోనే నిర్వహిస్తున్నారనే ప్రచారం జోరుగా ఉంది.