రైతుల భూసమస్యలు తీర్చుతూ వారికి ఓ మార్గం చూపాల్సిన ధరణి పై ఇప్పుడు అన్ని అనుమానాలు, విమర్శలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే ధరణి లో సమస్యలు పరిష్కారం కావడం ఆలస్యం అవుతుందని రైతులు ఆందోళన చెందుతుండగా అసలు ధరణి నిర్వహణే సరిగా లేదని ఆరోపణలు వస్తున్నాయి. ధరణి ని ఆసరాగా చేసుకుని కొంతమంది పైరవికారులు అక్రమాలకు పాల్పడుతుండగా అందులో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం వీరికి సహకరిస్తూ అందినకాడికి దండుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి…
ధరణిలో అనర్హుల హవా….?
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 574 మంది ధరణి లో ఉద్యోగం చేస్తున్నారు… ఉద్యోగం చేయడం బాగానే ఉంది కాని వీరంతా పైరవిలతో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్నట్లు సమాచారం. నిజానికి నిబంధనల ప్రకారం ధరణిలో పనిచేయడానికి బీటెక్, బిఎస్సి పూర్తి చేయాల్సి ఉండగా దాదాపు అందరూ బిఎ, బికాం చదివినవారే ఉద్యోగాలు పైరవిలతో దక్కించుకున్నారట. ధరణిలో రిక్రూట్మెంట్ చేసిన సంస్థ ఒక్కో అభ్యర్దినుంచి రెండున్నర లక్షలదాక వసూలు చేసి ఉద్యోగాలు కట్టబెట్టినట్లు ఉద్యోగాలు పొందినవారే బాహాటంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు అర్హత లేని కనీస విషయ పరిజ్ఞానం లేని వారిని నియమించడం మూలంగా రైతులు తమ భూసమస్యలు తీరక నానా పాట్లు పడుతున్నట్లు తెలిసింది. కాగా ఈ ఉద్యోగుల నియామకం కనీసం ఎలాంటి అర్హత పరీక్ష నిర్వహించకుండా చేయడం వల్ల పేరుకు ఉద్యోగులుగా వారు చెలామణి అవుతున్న పట్టుమని మూడు నెలలు కూడా ఉద్యోగం చేయడం లేదని దీనిని నియామకం చేసిన సంస్థ గ్రహించి ఉద్యోగాల్లోంచి తీసివేసి మళ్ళీ ఉద్యోగం ఇవ్వడానికి తిరిగి లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు ధరణిలో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల వేతనాల విషయంలోనూ విమర్శలే ఉన్నాయి. ధరణిలో పనిచేస్తున్న ఆపరేటర్ లకు ప్రభుత్వం అధికారికంగా చెల్లిస్తున్న వేతనంలో ఉద్యోగులను రిక్రూట్ చేసిన సంస్థ ఒక్కో ఉద్యోగి వేతనం నుంచి నాలుగు వేలకు పైగా కోత పెడుతున్నట్లు తెలిసింది.
ఆపరేటర్ ల నియామకంలో చక్రం తిప్పుతున్న ఆ నలుగురు ….
రాష్ట్రా వ్యాప్తంగా ధరణి ఆపరేటర్ ల నియామకంలో ఆ నలుగురు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తుంది ఉత్తర తెలంగాణ కు ఒకరు దక్షిణ తెలంగాణ కు ఒకరిని పెట్టుకొని ఉద్యోగాల దందా కొనసాగిస్తున్నారట ఈ ఇద్దరూ ఆ కంపెనీ కి చెందిన ఓ హెచ్ ఆర్ కు డబ్బులు ఇస్తే ఆయన వెంకటేశ్వరస్వామికి డబ్బులు అందిస్తారట ఇలా ఆ కంపెనీ అర్హత లేకున్నా అనేకమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారట
ఆ కంపనికే ఎందుకు….?
ధరణిలో ఉద్యోగాల భర్తీ కోసం సర్కార్ ఏదైనా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కి ఆ బాధ్యత అప్పగించాల్సి ఉంది. ఈ సంస్థ నిబంధనల ప్రకారం ఉపాధి కల్పన శాఖ గుర్తింపుతో పాటు అన్ని అనుమతులు కలిగి ఉండాలి కానీ ఇందుకు విరుద్ధంగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కి కాకుండా ఓ ఐటి సొల్యూషన్ సంస్థ కు అప్పగించడం అనుమానాలు కలిగిస్తున్నాయి.ఈ సంస్థ నిరుద్యోగుల వద్ద నుంచి లక్షల్లో వసూలు చేసి కొంతమందికి మొండి చెయ్యి చూపగ ఇప్పటికి ఆ నిరుద్యోగులు హైద్రాబాద్ లోని ఆ సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది.నిరుద్యోగుల తాకిడి తట్టుకోలేక అసంస్థ హైదరాబాద్ ప్యారడైజ్ నుంచి తన కార్యాలయాన్ని ఎవరికి తెలియకుండా బేగంపేటకు మార్చినట్లు తెలియవచ్చింది. ఇన్ని ఆరోపణలు,అనుమానాలు నిర్వహణ ,నియామక సంస్థ పై ముసురుకున్న నేపథ్యంలో ఇకనైనా సర్కార్ అర్హత కలిగిన ఉద్యోగులను నియమించేందుకు అన్ని అనుమతులు ఉన్న ఔట్ సోర్సింగ్ సంస్థకు నిబంధనల ప్రకారం అప్పగించి ప్రస్తుతం ఉన్న ఆ సంస్థను ధరణి బాద్యతలనుంచి తొలగిస్తుందా..లేదా చూడాలి.