హన్మకొండ నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమది… అన్ని ఆసుపత్రులు ఉన్న ఈ ప్రాంతం ఆసుపత్రుల జోన్ గా అందరికి తెలిసిందే…ఓ సినిమా హాలు తో సహా ఆస్పత్రులన్ని ఈ రహదారిలోనే ఉంటాయి… ఇలా నిత్యం బిజీగా ఉండే రహదారి ని ఆనుకొని ఓ ప్రముఖ వైద్యుడు తన ఆసుపత్రి కోసం గతంలో ఉన్న భవనం ముందు ఓ అదనపు నిర్మాణం చేస్తున్నాడు. ఆసుపత్రి కోసం అదనపు నిర్మాణం నిర్మించుకోవడం వరకు బాగానే ఉన్నా …దీనిని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తుండడం విమర్శలకు దారితీస్తుంది… ఇదే ప్రాంతంలో గత కొన్ని ఏళ్లక్రితం నిర్మించిన భవనాలు ఎంతో కొంత సెట్ బ్యాక్ తో నిర్మాణం చేస్తే ఈ ఆసుపత్రి భవనం ముందు మాత్రం అలాంటివేవి పట్టించుకోకుండా నిబంధనలతో మాకేం పని అన్నట్లు దర్జాగా ముందుకు జరిగి నిర్మాణం చేపడుతున్నారు. ప్రముఖ వైద్యుడిగా పేరొందిన ఓ వైద్యుడు నిర్మిస్తున్న ఈ అదనపు నిర్మాణం మున్సిపల్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉందనే విమర్శలు జోరుగా వినవస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధమే…?
హన్మకొండ నగరంలోని విజయ థియేటర్ ఎదురుగా ఓ ప్రముఖ వైద్యుడు తన ఆసుపత్రి కోసం ఆసుపత్రి బిల్డింగ్ ముందు తమకు నచ్చిన విధంగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా కనీస సెట్ బ్యాక్ కూడా లేకుండా అక్రమంగా ఆసుపత్రి ముందు నిర్మాణం చేపట్టారు. నగరంలో పేరుమోసిన వైద్యుడే ఇలా నిబంధనలు అతిక్రమించి అదనపు నిర్మాణం చేపట్టడం పై విమర్శలు వినవస్తున్నాయి.నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో నిబంధనలు పాటించకుండా రహదారి ముందుకు వచ్చి నిర్మాణం చేయడమే కాకుండా ఆసుపత్రికి సంబందించిన జనరేటర్ ను పూర్తిగా రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేశారు.ఇది కూడా నిబంధనలకు విరుద్ధమే ఐయిన ఆసుపత్రి యాజమాన్యం మాత్రం తమకేం పట్టనట్లు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనలకు అడుగడుగునా తూట్లు పొడుస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
టౌన్ ప్లానింగ్ అధికారులెక్కడా?
గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎక్కడ నిర్మాణం చేపట్టాలన్న టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతి తప్పనిసరి … హన్మకొండ నడిబొడ్డున విజయ థియేటర్ ఎదురుగా ప్రముఖ ఆసుపత్రి తన బిల్డింగ్ ముందు అదనపు నిర్మాణాన్ని వారి ఇష్టానుసారంగా నిర్మించుకున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. గ్రేటర్ వరంగల్ లో టౌన్ ప్లానింగ్ విభాగం సామాన్యులను ఒకలా ప్రముఖులను మరోలా చూస్తున్నట్లు సామాన్యులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు…సామాన్యులు చిన్న చిన్న నిర్మాణాలు చేసుకుంటే సవాలక్ష నిబంధనలు,ప్రశ్నలతో ఒకరకమైన భయాన్ని కలిగించే అధికారులు ఇంతటి బహిరంగంగా ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ఉన్న బిల్డింగ్ ముందు అదనపు నిర్మాణం చేస్తుంటే ఇదేంటని టౌన్ ప్లానింగ్ అధికారులు ఆసుపత్రి యాజమాన్యాన్ని ఇప్పటిబరకు ఏమాత్రం ఎందుకు ప్రశ్నించలేదో వారికే తెలియాలి… ప్రధానరహదారిలో జరుగుతున్న ఈ నిర్మాణం ఇంకా టౌన్ ప్లానింగ్ అధికారి దృష్టిలో పడలేదా… అని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు.