- సర్వే చేసి నిగ్గుతేల్చిన రెవెన్యూ అధికారులు..
- అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ విభాగం నోటీసులు జారీ …
- దేవాదాయ శాఖ అధికారులపై అనుమానాలు.. ?
న్యూస్ -10 కు ప్రజల ప్రశంసలు…
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్ ఆరేపల్లి లో గల బీరన్న ఆలయ భూమి కబ్జాను వెలికితీసిన న్యూస్- 10కు ప్రజల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ భూమి కబ్జా పర్వం తెలుసుకున్న జిల్లా అధికార యంత్రాంగం పూర్వాపరాలు తెలుసుకుని సోమవారం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తోపాటు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఆలయ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాల పై సర్వే జరిపారు. ఈ సర్వేలో ఆలయ భూమి కబ్జాకు గురికావడమే కాకుండా కబ్జా చేసిన భూమిలో అక్రమ నిర్మాణాలు జరిగాయి అంటూ అధికారులు నిగ్గు తేల్చడం పై ప్రజలు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ మండల తహసీల్దార్ సత్యపాల్ రెడ్డి ఆదేశాల మేరకు సర్వేయర్ సందీప్ , రెవెన్యూ సిబ్బంది బీరన్న ఆలయ భూమి సర్వే నెంబర్ 485, 485/ఏలో గల 15 గంటల స్థలం పై సర్వే జరిపి హద్దులను నిర్ణయించారు. దీంతో అక్రమ కట్టడాలు వెలుగులోకి వచ్చాయి. వరంగల్ ఆల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అక్రమఇండ్ల నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆక్రమణదారులు ఆలయ భూమి పై తమిళనాడు ప్రభుత్వ రికార్డులను కూడా తారుమారు చేసే ప్రయత్నంలో ఉన్నట్లుగా ప్రజలు, భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ జిల్లా అధికారులు కూడా ఈ విషయంలో నోరు మెదపకపోవడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉండాల్సిన ప్రభుత్వ భూమి ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లిపోవడం పై సమగ్ర కథనం ప్రచురించిన న్యూస్-10కు ప్రజలు ,భక్తులు అభినందనలు తెలిపారు……
దేవాదాయ శాఖ అధికారుల పై అనుమానాలు……….?
బీరన్న ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన దేవాదాయ ,ధర్మాదాయ శాఖ అధికారులు ఇంత జరుగుతున్న నోరు మెదపకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ శాఖకు చెందిన కొంతమంది అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఆక్రమణదారుల కు వంత పాడే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ శాఖలో ఉండి ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే ఈ విధంగా వ్యవహరించడం పై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, భక్తులు కోరుతున్నారు.