రైతుల్లో మనోధైర్యం నింపేందుకే

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే పూచి ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖమంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి అన్నారు.

ఆదివారం మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో మార్కెట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అటవీ, పర్యావరణం, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ… ప్రపంచ మానవాళి కరోనా వైరస్ ప్రభావంతో పెను విషాదం ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో రైతుల మనోధైర్యం కోల్పోకుండా వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు, రైతులు ఇబ్బందులకు కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. రైతులు పండించిన పంటలు తక్కువ రేటుకు వ్యాపారులు దళారులు కొనకూడదనే భావంతో ఆపద సమయంలో రైతులను ఆదుకోవాలని సంకల్పంతో సూక్ష్మస్థాయిలో నాలిక రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 5 లక్షల 92 వేల ఎకరాల్లో మక్కా సాగు జరిగిందన్నారు.

నిర్మల్ జిల్లాలో 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందన్నారు. 40 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందన్నారు. పౌరసరఫరాల శాఖ ఐకేపీ, పిఎసిఎస్, మార్క్ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. కరోనా ప్రభావంతో పౌల్ట్రీ రంగం కుదేలు అయిందన్నారు. రాష్ట్రంలో 5.92 లక్షల ఎకరాల్లో పంట సాగు అయిందని 14 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న వస్తుందని, దీనికి 3213 కోట్లు రూపాయలు చెల్లించవలసి ఉంటుందని అంచనా వేయడం జరిగింది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా1077 మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిర్మల్ జిల్లాలో 91 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్వింటాలుకు కనీస మద్దతు ధర1760/- చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతిదాని ధాన్యపు గింజను కొనే పూచీ ప్రభుత్వానిదే అన్నారు. సేద్యానికి వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న దృశ్య రైతులు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని, మనిషికి మనిషికి మధ్య మూడు అడుగుల సామాజిక దూరం పాటించాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలన్నారు.