నౌకరన్నడు నట్టేట “ముంచిండు”

నిరుద్యోగుల అవసరాన్ని క్యాష్ చేసుకున్నాడో ఉద్యోగి. నౌకరీ ఇప్పిస్తానని లక్షల్లో వసూళ్లు చేసి పత్తాలేకుండా పోయాడు. ఎంతకీ జాబ్ రాకపోయేసరికి మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఇన్వార్డ్ లో పని చేసే ఓ ఎంప్లాయి చేతివాటం చూపాడు. ఆయన ఉద్యోగ సంఘం నేతగానూ చెలామణి అవుతున్నాడు. జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ కు చెందిన 108 అంబులెన్స్ డ్రైవర్ పోస్టులు ఇప్పిస్తానని, తన పరిచయాలతో ఈ పని ఈజీగా అయిపోతుందని కొందరు నిరుద్యోగులను నమ్మించాడు. సుమారు 15మందికి ఇలాగే చెప్తూ ఒక్కొక్కరి నుంచి రూ. 1.50 లక్షల చొప్పున వసూలు చేశాడు. ఆ తర్వాత ప్లేటు ఫిరాయించాడు.

నౌకరన్నడు నట్టేట "ముంచిండు"- news10.app

– జాబు రాలే.. పైసలు తిరిగియ్యలే

సుమారు రెండేళ్లుగా రేపుమాపు అంటూ సదరు ఉద్యోగి మభ్యపెడుతూ వచ్చాడు. క్రమంగా అతడి తీరు అనుమానాస్పదంగా మారడంతో పలువురు నిలదీశారు. వారిని తొలుత సముదాయించాడు. “ఉద్యోగ సంఘం నాయకున్ని. మీరేం ఫికర్ చేయొద్దు” అని కూల్ చేసేందుకు యత్నించాడు. అయినా కొన్నాళ్ళకి బాధితులు నిలదీయడంతో.. తనను కులం పేరిట దూషించారని కేసు పెడతానని దబాయించాడు. తర్వాత ఫోన్లోనూ అందుబాటులో లేకుండా పోయాడు. తమకేం నౌకరీ ఇవ్వకున్నా ..కనీసం పైసలైనా వాపస్ చేయాలని బాధితులు కోరుతున్నారు.

అయ్యగారి స్టైలే వేరు

సదరు ఇన్వార్డ్ ఉద్యోగి హైదరాబాద్ లో ఉంటాడు. నౌకరి మాత్రం ఎంజీఎం లో. ఇతడు నెలలో వారం రోజులు డ్యూటీకి వచ్చినా నెలంతా పని చేసినట్లే. ఈయన రాజకీయ పలుకుబడితో చక్రం తిప్పుతూ డ్యూటీ కూడా ఎగ్గొడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ గా ఎవరున్నా. ఇతడిని గాడిలో పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలోనూ సదరు వ్యక్తి పై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఉద్యోగ సంఘం నాయకుడైతే డ్యూటీ చేయాల్సిన అవససరం లేదా? అని తోటి ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండ ఉంటే పేదోళలను దోచుకున్నా ఏ చర్యలూ తీసుకోరా? అని అతడి బాధితులు కంటతడి పెడుతున్నారు. చూడాలి మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో!?.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here