కాలువలను మింగేశారు….

రాజకీయ పలుకుబడి, అధికారుల అండదండలు తోడుంటే ఏమైనా చెయ్యొచ్చు, కబ్జాలు చెయ్యొచ్చు, పంట కాలువలు పూడ్చోచ్చు, అడిగే వారు లేరు, అడ్డుకునే అధికారులు అసలే లేరనుకున్నారో ఏమో… చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో కి నీరందించే పంట కాలువలను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టుతూ వెంచర్లు నిర్మిస్తున్నారు.

కాలువలను మింగేశారు....- news10.app

హసన్ పర్తి మండల రెవెన్యూ పరిధిలోని ఎల్లపూర్ చెరువు కింద ఉన్న దాదాపు వెయ్యి ఎకరాల పంట పొలాలకు చెరువు నీరే ప్రధాన ఆధారం. ఇక్కడి రైతులు చాలా కాలంగా కాలువల ద్వారా నీటిని పొలాల్లోకి మళ్లించి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.. నగర శివారు ప్రాంతం కావడంతో పలుకుబడి ఉన్న కొంత మంది నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి రైతుల నుండి వ్యవసాయ భూములను ఏకరాలుగా కొని రాత్రికి రాత్రే వెంచర్లుగా మారుస్తూ గజాల లెక్క ప్లాట్లను విక్రయించి కోట్లల్లో డబ్బు దండుకుంటున్నారు. ఈ క్రమంలో చెరువు నుండి పంట పొలాల్లోకి వెళ్లే నీటి కాలువలను సైతం వదలకుండా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు… దీంతో జాతీయ రహదారి కింద ఉన్న చిన్న సన్న కారు రైతుల పొలాల్లోకి నీటి సరఫరా లేకపోవడంతో రైతులు పంటలు పండక లబోదిబోమంటున్నారు. ఎల్లపూర్ చెరువు కట్టనుండి పంటపొలాల నీటి సరఫరా కోసం తూముల ద్వారా ఐదు పెద్ద కాలువలు ఉండగా అందులో నాలుగు కాలువలు పూర్తిగా ఆక్రమణకు గురికావడంతో పంటపొలాలు బీడు భూములుగా మారుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

పట్టింపులేని రెవెన్యూ….?

ఇక ఇదే అంశంపై బాధిత రైతులు పలుమార్లు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసి తమ గోడును వెళ్లబోసుకున్నా అధికారుల చర్యలు మాత్రం శూన్యం. రాజకీయంగా,ఆర్ధికంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు కాబట్టే సంబంధిత శాఖ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

కల్వర్టు ధ్వంసం….

ఇదిలా ఉంటె చెరువు తూము నుండి జాతీయ రహదారి కింద ఉన్న పొలాలకు నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన కల్వర్టు కూడా అక్రమ కట్టడానికి అనువైన చోటుగా మార్చుకున్నారు కబ్జారాయుళ్ళు… కల్వర్టు ను పూర్తిగా ధ్వంసం చేసి దాని పక్కనే భవన నిర్మాణం కూడా పూర్తి చేశారు. ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే ఈ నిర్మాణం చేపట్టిన స్థల సర్వే నెంబర్ భూమిని ఎలాంటి నిర్మాణాలకు వినియోగించకూడదని రహదారి విస్తరణ నేపధ్యంలో రెవెన్యూ శాఖ ఆదేశాలు కూడా జారీ చేసిందట….

ఓ కాలేజీ యాజమాన్య నిర్వాకం…?

జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ కళాశాల యాజమాన్యం బిల్డింగ్ నిర్మించేందుకు రైతులకు నీరందించే ప్రధాన కాలువను పూడ్చి దానిపై నామమాత్రంగా పైపు లైను నిర్మించి నీటిని దారి మళ్లించే ప్రయత్నం చేసింది… ఈ ఘనకార్యం వల్ల రైతులు నీటి సమస్యతో పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. వేచి చూడాలి మరి భూమినే నమ్ముకున్న అన్నదాతలకు అధికారులు ఎం న్యాయం చేస్తారో లేక అధికార పార్టీ నేతల అండదండలతో సమస్యను నీరుగారుస్తారో……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here