రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని ఆర్టిఏ కార్యాలయాలను అవినీతి చీడ పట్టి పీడిస్తోంది…ఈ అవినీతి లో కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు చిన్న స్థాయి ఉద్యోగి నుంచి పెద్ద స్థాయి అధికారి వరకు ఎవరి స్థాయిలో వారు అక్రమ వసూళ్ల పనిలో భాగం పంచుకుంటున్నారు…ఇదేంటని ప్రశ్నిస్తే అదంతే అని సమాధానం ఇస్తారు…ఈ అవినీతి చీడ పెద్ద స్థాయి అధికారి వరకు ఉంది కనుక ఆ అధికారి పట్టుపడ్డపుడు చూద్దాం …మనల్ని పట్టే వారు ఎవరు ఉన్నారు…?అనే ధీమాలో ఆర్టిఏ లో అవినీతి రోజురోజుకు పెరిగిపోతుంది…పనికో రేటు ఫిక్స్ చేసి తాము తమకోసం ఏర్పాటు చేసుకున్న కొందరు ఏజెంట్ల ద్వారా అధికారులు వసూళ్లు చేయించి బాగానే వెనకేస్తున్నట్లు న్యూస్10 పరిశీలనలో వెల్లడైంది…జోగులాంబ గద్వాల,నాగర్ కర్నూల్,కరీంనగర్ జిల్లాల్లో న్యూస్10 నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో అధికారుల కోసం ఏజెంట్లు చేస్తున్న వసూళ్ల భాగోతం బట్టబయలైంది…
జోగులాంబ గద్వాల లో ఇది దందా…
జోగులాంబ గద్వాలలో ఆర్టిఏ కార్యాలయం లో అక్రమ వసూళ్లకు లైసెన్స్ ఇచ్చినట్లే ఉంది పరిస్థితి…కార్యాలయం సమీపంలోనే ఏజెంట్లు తమ వ్యక్తిగత కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని వాహనదారులు టార్గెట్ గా తమను నియమించుకున్న అధికారుల కోసం అక్రమ వసూళ్లకు బరితెగిస్తున్నారు…ఏమాత్రం భయం లేకుండా పనికి ఇంత అని బేరం పెట్టి పైసా తక్కువైనా వదలకుండా ముక్కుపిండి మరి వసూళ్లు చేస్తున్నారు…కార్యాలయాల్లో బహిరంగంగానే వసూళ్లు చేస్తూ…పనిచేసిపెడుతున్నారు…”రేటు విషయంలో తగ్గేది లేదు…వసూలు చేసినదాంట్లో మాకు మిగిలేదు లేదు” అని వాహనదారులకు చెప్పి మరి దోచేస్తున్నారు ఇక్కడి ఏజెంట్లు…
నాగర్ కర్నూల్ లో అదే దందా….
జోగులాంబ గద్వాల జిల్లాలో లాగానే నాగర్ కర్నూల్ లో ఏజెంట్లు అధికారుల కోసం వసూళ్లు చేస్తున్నారు కాని ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది…ఏజెంట్లు నేరుగా ఆర్టిఏ కార్యాలయం లోకి వెళ్లి అధికారులను కలిసి మరి పనిచేస్తున్నారు…వాహనదారుల నుంచి నగదు,డిజిటల్ రూపంలో డబ్బులు తీసుకొని అధికారులకు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తున్నట్లు తెలిసింది…ఇక్కడ ఏజెంట్ల సంఖ్య తక్కువగానే ఉన్నా…వసూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి…
కరీంనగర్ లో జోరుగా వసూళ్ల దందా….
కరీంనగర్ జిల్లాలో ఆర్టిఏ కార్యాలయంలో వసూళ్ల దందా బాగానే సాగుతుంది…ఇక్కడి అధికారులు ఎవరికి వారే ఏజెంట్ల ను తమకు మధ్యవర్తులు గా నియమించుకొని వాహనదారులనుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి… ఇక్కడ వాహన దారుల నుంచి ఏజెంట్లు నగదు రూపంలో కాకుండా ఫోన్ పే,గూగుల్ పే వంటి డిజిటల్ రూపంలో డబ్బులు తీసుకొని పనులు చేసి పెడుతున్నారు… ఇక్కడ కూడా ఏజెంట్లు నేరుగా ఆర్ టి ఏ కార్యాలయం లోకి వెళ్లి అధికారులతో మాట్లాడి విషయం చెప్పి పనులు చేసేస్తున్నారు…ఇక్కడ డి టి సి స్థాయి అధికారి సైతం ఓ ఏజెంట్ ను నియమించుకొని రోజువారి వసూళ్లు చేస్తున్నారు…ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే గతంలో హన్మకొండలో డి టి సి గా విధులు నిర్వహించి కరీంనగర్ కు బదిలీ ఐ మొన్నటివరకు హన్మకొండ ఇంచార్జ్ డి టి సి గా పనిచేసిన ఓ అధికారి తనకు మధ్యవర్తిగా వ్యవహరించి వసూళ్లు చక్కబెట్టడం కోసం ఓ ఇద్దరు ఎజెంట్లను హన్మకొండ నుండి తీసుకువెళ్లినట్లు సమాచారం…పెద్ద సారు బదిలీ కాగానే ఈ ఇద్దరు ఏజెంట్లు తట్టాబుట్ట సర్దుకొని కరీంనగర్ కు మకాం మార్చినట్లు తెలిసింది…కరీంనగర్ ఆర్ టి ఓ కార్యాలయానికి అర కిలోమీటర్ దూరంలో ఈ ఇద్దరు ఏజెంట్లు సారు కు సంబంధించిన పైల్స్ వ్యవహారాలు పరిశీలించి కావాల్సింది ఇవ్వగానే కోడ్ ద్వారా సార్ కు ఫైల్ పంపించగానే నిరభ్యంతరంగా పని కానిచ్చేస్తున్నట్లు తెలిసింది….
కరీంనగర్, జోగులాంబ గద్వాల,నాగర్ కర్నూల్ జిల్లాల ఆర్టిఏ కార్యాలయాల్లో అవినీతి భాగోతం పై న్యూస్ 10 వరుస కథనాలు….



