జన్‌ధన్‌ ఖాతాల నుంచి నగదు వెనక్కి

అనర్హులకు జమచేసినందుకే ఉపసంహరణ: టీజీబీ జీఎం

హైదరాబాద్‌: కరోనా నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు అందించిన నగదు మొత్తంలో పొరపాటు దొర్లింది. అనర్హులకు ఖాతాల్లో డబ్బులు జమకావడంతో తప్పు దిద్దుకోనే పనిలో అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల జన్‌ధన్‌ ఖాతాలకు పీఎంజీకేవై కింద జమచేసిన రూ.16 కోట్లకు పైగా నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ) వెనక్కి తీసుకుంది.

జన్‌ధన్‌ ఖాతాల నుంచి నగదు వెనక్కి- news10.app

దేశంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో జన్‌ధన్‌ ఖాతాల్లో నెలకు రూ.500 చొప్పున మూడు నెలలపాటు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఆయా ఖాతాల్లో ఈనెల మొదటివారంలో దేశవ్యాప్తంగా నగదు జమ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలోని 473 శాఖల్లో సుమారు 9లక్షల మంది ఖాతాల్లో ఏప్రిల్‌ నెలకు చెందిన రూ.500 చొప్పున జమ అయ్యాయి. అయితే వీరిలో 5,15,260 మంది మినహా మిగిలిన వారిని అనర్హులుగా బ్యాంకు తేల్చింది. ఇప్పటికే అనర్హుల ఖాతాల్లో జమ చేసిన సుమారు రూ.16 కోట్లకు పైగా నగదును వెనక్కి తీసుకున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం మహేశ్‌ తెలిపారు. 1 ఆగస్ట్‌, 2014 తర్వాత ప్రారంభించిన ఖాతాలనే అర్హులుగా తేల్చినట్లు ఆయన స్పష్టం చేశారు. తమ వద్ద జరిగిన పొరపాటు వల్లే నగదును అనర్హులకు జమచేశామని.. వారంరోజుల తర్వాత గుర్తించి వెనక్కి తీసుకున్నామని జీఎం వివరించారు. అనర్హుల్లో ఇప్పటికే లక్షకు పైగా ఖాతాదారులు నగదును తీసుకున్నారని.. వారి నుంచి తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here