ధరణి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగవద్దని ఇకపై భూ వ్యవహారాలు అన్ని అత్యంత పారదర్శకంగా ఉండాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టింది. ఇదంతా బాగానే ఉన్నా ధరణి ని ఆసరాగా చేసుకుని మోసాలు జరుగుతున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ ఆరోపణల విషయం ఎలా ఉన్నా అసలు ఈ ధరణి ని నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థ పైనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ధరణి నిర్వహణ బాధ్యతలు ఐ ఎల్ ఎఫ్ ఎస్ అనే సంస్థ కు అప్పగిస్తే ఆ సంస్థ ఎలాంటి అర్హతలు లేని ఓ ఐటి కంపెనీకి తన బాధ్యతలు ధారాదత్తం చేసిందని ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రంలో అన్ని అనుమతులు ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లు అనేకం ఉన్న ఎలాంటి అర్హతలు లేని అసలు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కానీ ఓ ఐటి సంస్థ కు బాధ్యతలు అప్పగించడం పై అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే సర్కారు నిబంధనల ప్రకారం ఆ బాధ్యతలను అన్ని అనుమతులు నిర్వహణ సామర్థ్యం ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లకే అప్పగిస్తారు. కానీ సర్కార్ నుంచి ధరణి బాధ్యతలు తీసుకున్న సంస్థ తన ఇష్టారాజ్యాంగ ఓ ఐటి సంస్థకు ధరణి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ సంస్థ డబ్బులు దండుకోవాలని చూడడం తప్ప ధరణి నిర్వహణ సరిగా చేయడం లేదని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంస్థ ఇలా సర్కార్ నిభందనలకు విరుద్ధంగా ఇంకో సంస్థ కు బాధ్యతలు ఇవ్వడంతో ఇదే అదనుగా భావించిన కొంతమంది పైరవికారులు ఇందులో దూరి భూముల సెటిల్మెంట్ పేరుతో పైరవీలు చేస్తూ పని చేసి పెడటామంటు భారీగా దండుకుంటున్నట్లు తెలిసింది. దింతో ప్రతి చిన్న పనికి రైతులు, భూ యజమానులు ఎంతో కొంత చెల్లిస్తే తప్ప పని కానీ పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. దీని మూలంగా ధరణి అంటేనే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు బెదిరిపోయే పరిస్థితి నెలకొందని కొందరు రెవెన్యూ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.
ధరణిలో పని కావాలంటే తామే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆశ్రయించాల్సివస్తుందని అర్హత లేని సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించడం పట్ల అధికారులుగా రైతుల పనులు సకాలంలో చేయాలంటే తామే నానా పాట్లు పడాల్సివస్తుందని వారు ఆఫ్ ది రికార్డ్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇంతలా అటు రైతులను ,ఇటు అధికారులను సైతం తిప్పలు పెడుతున్న ధరణి విషయంలో సర్కార్ పునరాలోచించి సమర్ధమంతమైన సంస్థకు ధరణి నిర్వహణ బాధ్యతలు కట్టబెట్టాలని రైతులు కోరుతున్నారు. రైతుల భూమి సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని వారి పనులను సులభతరం చేయడానికే ధరణి అంటూ చెపుతున్న సర్కార్ ప్రస్తుతం ధరణి ని నిర్వహిస్తున్న సంస్థను తొలగిస్తుందా లేదా చూడాలి.