వరంగల్ త్రినగరిలో కబ్జారాయుళ్ల కు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఖాళీ జాగా కనపడితే చాలు అది తమకోసమే ఉన్నట్లు కబ్జా చేసి కాలర్ ఎగరేస్తున్నారు… ప్రభుత్వ స్థలం,ప్రయివేటు స్థలం అనే తేడాలేకుండా కబ్జా చేసి అక్రమంగా ఆస్తులు కూడబెడుతున్నారు. ఇలా కబ్జాలు చేస్తున్న వారిని ఎవరు అడ్డుకునేది లేకపోవడంతో బరితెగించి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కొంతమంది కబ్జా రాయుళ్లు హన్మకొండ పెద్దమ్మగడ్డ సమీపంలోని కె ఎస్ ఆర్ గార్డెన్ వెనుకవైపు ఉన్న నిమ్మాయ చెరువుకు కొంతమంది కబ్జారాయుళ్లు ఎసరు పెట్టారు. చెరువు శిఖం భూమి నుంచి చెరువు లోపలి వరకు టిప్పర్ లతో మట్టి తరలించి చెరువును మట్టి తో పూడ్చి వేస్తున్నారు.
రాత్రికి రాత్రే….
కె ఎస్ ఆర్ గార్డెన్ వెనుకవైపు ఉన్న నిమ్మాయ చెరువును కబ్జా దారులు రాత్రికిరాత్రే మట్టితో ఇప్పటి వరకు పది ఎకరాల పైన పూడ్చి వేసి కబ్జా కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. ఐయితే లేదంటే తెల్లవారుజామున కబ్జారాయుళ్లు తమ పని కానిస్తున్నారు.టిప్పర్ లతో పెద్ద పెద్ద రాళ్లు, మట్టి తీసుకువచ్చి చెరువును పూడ్చేస్తున్నారు. దింతో చెరువు కింద భూములు సాగు చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొద్ది రోజుల్లో ఇక్కడ నిర్మాణాలు మొదలయిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని… కబ్జారాయుళ్లు చెరువును అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేసేందుకే ఎవరి కి తెలియకుండా రాత్రిపూట, తెల్లవారుజామున పనులు నిర్వహిస్తున్నారని రైతులు అంటున్నారు.
పురాతన చెరువు…
హన్మకొండ కె ఎస్ ఆర్ గార్డెన్ వెనకాల ఉన్న నిమ్మాయ చెరువు దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర కల్గిన చెరువుగా రైతులు చెపుతున్నారు. ఈ చెరువు పారకం కింద ఇప్పటికి ఓ వెయ్యి ఎకరాల పంట సాగవుతుంది. పెద్దమగడ్డ,పైడిపల్లి కి చెందిన రైతులు ఈ చెరువు కింద భూములను కలిగి ఉండి ఇప్పటికి సాగుచేస్తున్నారు.. అలాగే ములుగురోడ్డు ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన కొన్ని పంటపొలాలు సైతం ఈ చెరువు నీటితోనే సాగవుతున్నట్లు తెలిసింది.
ఎవరి పరిధి…?
కె ఎస్ ఆర్ గార్డెన్ వెనకాల ఉన్న నిమ్మాయ చెరువు ఏ రెవెన్యూ పరిధిలోకి వస్తుందో రెవెన్యూ అధికారులు తేల్చుకోలేకపోతున్నారట. చెరువు కబ్జా విషయమై రైతులు పిర్యాదు చేయడానికి వెళ్తే హన్మకొండ, వరంగల్ కు చెందిన రెవెన్యూ అధికారులు తమ పరిధిలో లేదంటే తమ పరిధిలో లేదని అంటున్నారని రైతులు తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో మాత్రం రెండు ప్రాంతాల పరిధిలో చెరువు ఉందని అన్నట్లు రైతులు చెపుతున్నారు.
కలెక్టర్ కు పిర్యాదు…
నిమ్మాయచేరువు కబ్జా బారిన పడకుండా కాపాడాలని చెరువు కింద భూములు సాగు చేస్తున్న రైతులు హన్మకొండ జిల్లా కలెక్టర్ ను కలిసి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. చెరువును కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను వారు కోరారు.