2018 మే 28 ఏడు కుటుంబాల్లో విషాదాన్ని నింపగా…. మరో 28 కుటుంబాల్లో తీవ్రమైన భయాన్ని కలిగించింది… పనుల నిమిత్తం గమ్య స్థానాన్ని చేరుకునేందుకు ఆర్ టి సి బస్సుల్లో ప్రయాణం చేస్తున్న వారిలో ఓ ఏడుగురు ప్రయాణికులకు చివరి ప్రయాణ మయింది. .ఆర్ టి సి బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో 28 మంది గాయాలపాలయ్యారు…ఇప్పటికి ఆ విషాదం ఆ ప్రమాదపు భయం బ్రతికున్న వారిని వెంటాడుతూనే ఉంది… ప్రమాదం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు,ఎమ్మెల్యేలు మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు… సాక్షాత్తు అప్పటి ఆర్థిక మంత్రి,ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ 5 లక్షల ఎక్సగ్రేషియాను మృతుల కుటుంబాలకు ప్రకటించారు… కానీ 2018 మే28 న ప్రమాదం జరిగితే ఇప్పటివరకు మృతుల కుటుంబాలకు నయాపైసా అందలేదు… సి ఎన్ ఓ 9511/సి ఎం ఆర్ ఎఫ్/2019 నంబర్ గల ఫైల్ ఇంకా సచివాలయంలోని సీఎం పేషీలోనే మూలుగుతోందట కానీ ముందుకు కదలడంలేదట….. మృతుల కుటుంబాలు మాత్రం రేపు మాపు అంటూ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న ఫలితం మాత్రం ఇప్పటికి దక్కలేదు… మృతుల కుటుంబాలు అన్ని కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని సచివాలయం చుట్టూ తిరుగుతూ… ఎవరెవరిని కలవాలి… ఎలా కలవాలి అని చర్చలు పెట్టుకొని సమాచారాన్ని గ్రూపు లో షేర్ చేస్తూ… చెప్పులరిగేలా తిరుగుతున్న నేటికి సర్కారుకు జాలి కలగలేదు… ప్రకటించిన అమాత్యుల వారికి సమయం చిక్కక వారికి నష్ట పరిహారం అందలేదు….
ఇదీ విషయం…!
కరీంనగర్ జిల్లాలో మూడు సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజెర్ల వద్ద వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ గోపాలపురం కు చెందిన రాయబారి సుభాషిణి, కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి కి చెందిన పిల్లి లచ్చవ్వ, జమ్మికుంటకు చెందిన గుండ హరిప్రసాద్, వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హావేలి కి చెందిన ఐ లోని నాగరాజు, సైదాపూర్ కు చెందిన పేరాల ప్రభాకర్, ముషీరాబాద్ కు చెందిన జాకీర్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందినఖాజీపేట రైల్వే జే యి రాజేష్ కుమార్ లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న ఆనాటి ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఒక్కొక్కరికి ఐదులక్షల నష్టపరిహారం ప్రభుత్వం తరపున ప్రకటించారు.
కానీ ప్రమాదం జరిగి మూడు సంవత్సరాలు అవుతున్నా ఆ కుటుంబాలకు నష్టపరిహారం మాత్రం అందడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మూడు సంవత్సరాల నుండి మంత్రులను కలిసి మొరపెట్టుకున్నా , సచివాలయానికి వెళ్లి అధికారులను కలిసినా న్యాయం జరగట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్ట పరిహారం ప్రకటించిన మంత్రి ఈటల లను ఇతర మంత్రులను కలిసిన ఇప్పటికి న్యాయం జరగలేదని భాదితులు చెప్తున్నారు… సీఎం పేషీలో ఉన్న పైల్ ఉన్న ఇంకెప్పుడు తమకు నష్ట పరిహారం అందుతుందని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి… నష్ట పరిహారం అందడానికి మూడు సంవత్సరాల పైగా ఎందుకు అవుతున్నదని వారు అడుగుతున్నారు. ఇప్పటికైనా మంత్రి ఈటల స్పందించి తమకు నష్ట పరిహారం అందేలా చూడాలని వారు కోరుతున్నారు.
సచివాలయం పోనీ రోజు లేదు
ఐలోని అభిషేక్ మృతుని సోదరుడు ఎలుకుర్తి, గీసుగొండ, వరంగల్ రూరల్ జిల్లా
రోడ్డు ప్రమాదం జరిగి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు మా కుటుంబానికి నష్టపరిహారం అందలేదు, కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టాము, గ్రీవెన్స్ సెల్ లో దరఖాస్తు ఇచ్చాము మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ను కలిసాము, హైద్రాబాద్ సెక్రటరియేట్ కు వెళితే మీ ఫైల్ సీఎం పేషికి పంపాము అని చెప్తున్నారు దయచేసి ప్రభుత్వ పెద్దలు మా కుటుంబానికి రావలసిన నష్ట పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్న.
కాస్త కనికరించాలి… జయ ప్రకాష్…
చెంజెర్ల బస్సు ప్రమాదంలో నా భార్య సుభాషిణి మృతి చెందింది… ఇప్పటికి ఆ ఘటనను మర్చిపోను… నా కళ్ళ ముందే నాభార్య ప్రాణం విడిచింది… ప్రభుత్వ సాయం చేస్తామని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి చేయలేదు… సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీసు కు పంపారు అంటున్నారు… ఇకనైనా ప్రభుత్వం కనికరం చూపాలి.
కార్యాలయాల చుట్టూ తిరిగాం
గుండ సాయిరాం.. మృతుడు గుండ హరిప్రసాద్ తండ్రి
ఎదిగిన కొడుకును బస్సు ప్రమాదంలో పోగొట్టుకున్న… లెక్చరర్ గా పని చేస్తూ మమ్మలి పోషించేవాడు… ప్రభుత్వం ఎక్సగ్రేషియా ఇస్తామని ఇప్పటికి ఇవ్వలేదు… దానికోసం తిరగని ప్రభుత్వ కార్యాలయంలేదు… వస్తది అంటారు కానీ మూడు సంవత్సరాలు గడిచిన ఇప్పటికి మాత్రం ఇవ్వలేదు..