సామాజిక దూరం, స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి: కుడా చైర్మన్‌ మర్రియాదవరెడ్డి

ప్రతి ఒక్కరు సామాజిక దూరం, స్వీయ నియంత్రణ పాటించినప్పుడే కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చని కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం కుడా కార్యాలయ అవరణలో నిత్యావసర వస్తువులను గ్రేటర్‌ కమిషనర్‌ పమేల సత్పతితో కలసి హన్మకొండ జర్నలిస్టుల పరపతి సంఘం సభ్యులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ కేంద్రంతో పాటు సీఎం కేసీఆర్‌ ముందస్తుగా తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉన్నారని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి ధరించి పోలీసులకు, జిల్లా పాలనాయంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.

భౌతిక దూరం పాటించాలి…కమిషనర్‌

జర్నలిస్టులు అధికార యంత్రాంగంతో పాటు కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్నారని, అదే సమయంలో భౌతిక దూరం తప్పక పాటించాలని గ్రేటర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ పమేల సత్పతి అన్నారు. మహారాష్ట్రంలో 53మందిలో మెజార్టీ జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయాలను గుర్తుపెట్టుకున విధులు నిర్వర్తించాలని సూచించారు. విధి నిర్వహణతో పాటు ప్రాణాలు కూడా ముఖ్యమన్న విషయాలను మరవద్దని ఆమె అన్నారు. వార్తల సేకరణలో జర్నలిస్టులు సామాజిక దూరం పాటించడం లేదని, ఈవిషయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ యంత్రాంగానికి జర్నలిస్టులు సహకారం అందిచాలన్నారు. ఈకార్యక్రమంలో 39వ డివిజన్‌ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్, కుడా అధికారులు అజిత్‌రెడ్డి, జర్నలిస్టుల పరపతి సంఘం అధ్యక్షుడు అలువాల సదాశివుడు, ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్,కోశాధికారి కంకణాల సంతోష్, సహయ కార్యదర్శి సాయిప్రదీప్, సహాయ కోశాధికారి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు ఎన్‌. బుచ్చిరెడ్డి, కొల్ల కష్ణకుమార్‌రెడ్డి, గోకారపు శ్యామ్‌ కుమార్, వలిశెట్టి సుధాకర్, సభ్యులు పాల్గొన్నారు.