కోట్ల రూపాయల…… మట్టికొట్టుకు పోతున్నారు….!

ఒక్క వేసవిలోనే కోట్లు కూడబెడుతున్న మట్టి అక్రమ వ్యాపారులు.
ఏటా ఒక్కో మట్టి వ్యాపారి లక్ష్యం ఖర్చులు పోను 75 లక్షలు…?
ఖాజీపేట, సంగెం, ఖిలావరంగల్, గీసుగొం డ, ఐనవోలు, ఆత్మకూరు, దామెర, హాసన్ పర్తి, మండలాల్లో భారీగా అక్రమ మట్టి తవ్వకాలు
JCB లు, ప్రొక్లైనేర్లు, లతో భూమిని దోచుకుంటున్న భూ భకాసురులు
రెవెన్యూ అధికారుల అండతో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
జిల్లా వ్యాప్తంగా చెరువులు, అసైన్డ్ భూములు లక్ష్యంగా కొనసాగుతున్న వ్యాపారం
మైనింగ్, విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ లోపంతో కోట్లు కుడబెడుతున్న అక్రమార్కులు
మట్టి దొంగలకు అండగా నిలుస్తున్న ప్రజాప్రతినిధులు

వరంగల్ ఉమ్మడి జిల్లాలో మట్టి బకాసురులు యథేచ్ఛగా మట్టిని కొట్టుకుపోతున్నారు. ఒక్క వేసవికాలంలోనే మట్టి వ్యాపారులు ఒకొక్కరు సుమారు.కోటి రూపాయల పైన అక్రమ సొమ్మును వెనకేసుకుంటున్నట్లు సమాచారం. ఒక్క రెండు నెలల కాలంలో మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వి అప్పుడప్పుడు మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇతరులను తమడిన శైలిలో సంతృప్తి పరిచి ఈ దందాను నడిపిస్తారనే ఆరోపణలు లేకపోలేదు. మట్టే కదా… అని తేలికగా తీసుకున్న దీని నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములలో ఈ దందా కొనసాగుతుండగా అడ్డుకునేవారు లేక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.కోట్ల రూపాయల...... మట్టికొట్టుకు పోతున్నారు....!- news10.app

కలిసొచ్చిన కరోన..!

కరోన మూలంగా లాక్ డౌన్ మట్టి వ్యాపారులకు బాగానే కలిసొచ్చింది. వ్యవసాయపనుల పేరుతో మట్టి దందాను కొనసాగించడమే కాకుండా అధికారులందరు కరోన నిర్ములనా విధుల్లో బిజీగా ఉండడం సైతం అందివచ్చిన వరంలా మారింది. లాక్ డౌన్ కాలంలోనే ఇప్పటివరకు 50 లక్షల పైనే ప్రతి మట్టి వ్యాపారి దందా ను కొనసాగించాడంటే వీరి అక్రమ వ్యాపారం ఎంత లాభసాటిగా కోనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. కొందరైతే పగటి వేళల్లో కాకుండా రాత్రి వేళల్లో ప్రోక్లినర్ల ద్వారా మట్టిని తవ్వి రాత్రికి రాత్రే లారీలు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలించారు.

మట్టి దందా ఇలా….

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా కోన సాగుతున్నాయి. ఈ మట్టి తవ్వకాలకు ఎక్కడ అడ్డు అదుపు లేకుండా పోతుంది. జిల్లాలోని చెరువులు అసైన్డ్ భూములు లక్ష్యంగా మట్టి తవ్వకాలు జరగడం సర్వసాధారణంగా మారింది అక్రమంగా మట్టిని తవ్వి టిప్పర్ లలో తరలిస్తున్నారు. రోజు ఒక్కొక్కరు వందల ఫీట్ల మేర తవ్వి మరి తరలించడం బహిరంగ రహస్యంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని మామునూరు, కొండపర్తి, తరాలపల్లి, వెంకటాపురం, పెద్దాపురం, ఎల్గురు, గుంటురుపల్లి, ధర్మసాగర్, ఊకల్, తిమ్మాపురం, ఊరుగొండ, జక్కలోద్ధి, తదితర ప్రాంతాల్లో అడ్డు అదుపు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఊళ్ళల్లోని పంట పొలాలకు నీరు అందించే చెరువులను నాశనం చేయడం మట్టి దొంగలకు అలవాటు గా మారింది. చెరువుల్లో నీ రాగడి మట్టిని తవ్వి ఇటుక బట్టీలకు అమ్ముతున్నారు, మరి కొందరు అసైన్డ్ భూములను లక్ష్యంగా చేసుకొని రాత్రి పగలు అని తేడా లేకుండా భూమిని పిండి ప్రైవేట్ భూముల్లో, వెంచర్ లలో మొరం పోస్తూ లక్షల రూపాయలకు మట్టిని అమ్ముకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏకంగా ఏకరానికి 10 నుంచి 15 లక్షలకు కొనుగోలు చేసి కోటి రూపాయలు విలువగల మట్టిని, మొరాన్ని తవ్వి అమ్ముకోవడం వరంగల్ జిల్లాలో ని మట్టి దొంగలకే చెల్లింది.. చెరువు లోని రాగడీ మట్టి టిప్పర్ కు అత్యధికంగా 4000 కు అమ్మడం, మొరo టిప్పర్ 1000 నుండి 2100 రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

అధికారుల దొంగ నిద్ర….!

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మట్టి మాఫియా రుచి పోతున్న అధికారులు మాత్రం దొంగ నిద్ర నటిస్తున్నారు. కోట్లల్లో వ్యాపారానికి లక్షల్లో ముడుపులు ముట్టజెపితే ఎం జరిగిన ప్రేక్షక పాత్ర పోషిస్తూ, ఎవరైనా దందా పై నిలదీస్తే చూస్తాం, చేస్తాం అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెపుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈమట్టి దందా అంతా కొందరు మైనింగ్,రెవెన్యూ అధికారుల కనుసన్నలలో నడుస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్, కొందరిది పగలు, మరికొందరిది రాత్రి వ్యాపారం నడిపిస్తూ బహిరంగంగా మట్టిని తవ్వి లారీల్లో, టిప్పర్లో, ట్రాక్టర్ లో మేన్ రోడ్ గుండా తరలిస్తున్న అధికారులకు కనపడటం లేదా…. అనేది ప్రశ్న ఈ అక్రమ వ్యాపారం బహిరంగంగానే జరుగుతున్న, అధికారులు ఎక్కడా చర్యలు ఎందుకు చేపట్టడం లేదో అని అనుమానం సగటు పౌరునికి కలుగుతుంది. ముఖ్యంగా మట్టి తవ్వకాలపై చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ యత్రాంగం, మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు నిద్రమత్తులో తూగుతున్నారన్న విమర్శలు లేకపోలేదు.

ప్రజా ప్రతినిధుల అండ…?

ప్రతి మట్టి వ్యాపారి వెనుక ఓ ప్రజా ప్రతినిది ఉన్నాడనేది నిజంగానే కనపడుతుంది. మట్టి వ్యాపారిని ఎవరిని ఈ అక్రమ దందా గూర్చి ప్రశ్నిస్తే ఆ ప్రజా ప్రతినిది పేరు చెప్పి కాలర్ ఎగిరిస్తారు. మీరు నన్ను ఏం చేయలేరని పోజులు కొడతారు. కొందరైతే ఏకంగా ఈ దందా ప్రజాప్రతినిదిదే అంటూ నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. నిజానికి కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ మట్టి దందా ను నిర్వహిస్తూన్నట్లు తెలిసింది. ఇంకొంతమంది తమ అనుచరులు, పరిచయస్తుల తొ అక్రమ మట్టి దందా నడిపిస్తూ మేమున్నాం… చేసుకోండి అంటూ భరోసానిస్తున్నారట. అందుకే మట్టి మాఫియా ఘనులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. కొంతమంది రెవెన్యూ అధికారులు అక్కడక్కడ నిజాయితీగా పనిచేసి వాహనాలను సీజ్ చేసిన, ప్రజాప్రతినిధుల పైరవీలతో వదిలిపెట్టడం జరుగుతుంది. మరోవైపు మైనింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, విజిలెన్స్ అధికారులకు అసలు పట్టింపే లేకపోవడం మట్టి మాఫియాకు కలిసొచ్చే అంశం. ఇప్పటికైనా అధికారులు నిద్ర మత్తు వీడి నిజాయితీగా పని చేసి ప్రభుత్వ చెరువులను, అసైన్డ్ భూములను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.