గోదాం ను గాలికొదిలేశారు….!

సమస్యల వలయంలో …. శాయంపేట గోదాం
ఏ మాత్రం భద్రత లేని గోదాం
త్రాగునీరు కూడా లేని దుర్భర పరిస్థితి.
పట్టించుకోని అధికారులు ప్రజా ప్రతినిధులు.

శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామ శివారులో ఉన్న గోదాం ( గిడ్డంగి) లో అన్నీ సమస్యలే.. మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి హయాం(2018)లో ఐదువేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసే గోదాం ( గిడ్డంగి) లను ఏర్పాటు చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఈ గోదాములో అనేక సమస్యలు తాండవిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు గోదాం లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించకపోవడం మూలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కార్మికులకు అందులో పనిచేసే ఉద్యోగులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని విమర్శలు వచ్చిపడుతున్నాయి.

గోదాం ను గాలికొదిలేశారు....!- news10.app

భద్రత లేని గోదాం …..

భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శాసన సభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి హయాంలో లక్షలాది రూపాయలు వెచ్చించి 5000 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసే గోదాంలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు గోదాములో తలెత్తిన సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం విడ్డూరం. గడిచిన మూడేళ్లలో గోదాం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేసారు. దీని మూలంగా భారీ గేటు ను ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో భద్రతపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. వే బ్రిడ్జి ఉంది కానీ కరెంట్ కనెక్షన్ లేదు ఇప్పటికి ఇక్కడ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో అందులో పనిచేసే ఉద్యోగుల కోసం కనీసం ఫ్యాన్ లు కూడా పని చేయక ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ కలెక్షన్ లేకపోవడంతో గోదాం లో పనిచేసే కార్మికులు విశ్రాంతి తీసుకునేముందు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడానికి నీరు లేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు చొరవ తీసుకుని తక్షణమే కరెంట్ కనెక్షన్ ఇప్పించాలని కార్మికులు కోరుతున్నారు.గోదాం లో పనిచేసే ఉద్యోగులకు హమాలీ కార్మికులకు త్రాగు నీరు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు గతంలో బోరు వేసిన కరెంట్ కనెక్షన్ లేకపోవడంతో నీటి కోసం ప్రతిరోజు 30 నుండి 40 రూపాయల వరకు తమ సొంత డబ్బులను కేటాయించాల్సి వస్తుందని వారు తెలిపారు. కనీస మౌలిక సదుపాయాల కొరకు కరెంట్ కనెక్షన్ ఇప్పించాలని కార్మికులు అన్నారు.

పట్టించుకోని అధికారులు ప్రజా ప్రతినిధులు.

గోదాంలో సమస్యలు తాండవిస్తున్న సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం విడ్డూరం. గడిచిన మూడేళ్లలో గోదాం లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. గోదాం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం తో పాటు గేటును బిగించాలి. దాంతోపాటు ప్రధానంగా వే బ్రిడ్జి పనులను కొనసాగించాలన్నా, కార్మికులకు త్రాగు నీరు అవసరం కాబట్టి గోదాం లో ఉన్న బోరు పని చేయాలన్న కరెంట్ కనెక్షన్ తప్పనిసరి. ఇప్పటికైనా గోదాంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా తక్షణమే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.